నా కుమార్తెను చంపేస్తాన‌ని ఓ వ్య‌క్తి వీడియో పెట్టాడు: బ‌న్నీ వాసు

25-07-2021 Sun 12:38
  • ఆ వీడియో తొలగించేలా చేయ‌డానికి చాలా క‌ష్టాలు ప‌డ్డాను
  • సామాజిక మాధ్య‌మాల సంస్థ‌ల‌కు ఫిర్యాదులు చేశా
  • ఎవ‌రో ఒక‌రు పెట్టిన స‌మాచారం అబ‌ద్ధ‌మ‌ని నిరూపించ‌డం చాలా క‌ష్టం
  • గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌కు  బ‌న్నీ వాసు లేఖ
bunny vasu writers letter to google ceo

గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌కు ప్ర‌ముఖ నిర్మాత బ‌న్నీ వాసు ఓ లేఖ రాశారు. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న త‌ప్పుడు ప్ర‌చారంపై ఆ లేఖ‌లో ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న కుమార్తెను చంపేస్తాన‌ని చెబుతూ ఓ వ్య‌క్తి సామాజిక మాధ్య‌మాల్లో ఓ వీడియో పెట్టాడని బ‌న్నీ వాసు చెప్పారు. ఆ వీడియోను సామాజిక మాధ్య‌మాల్లోంచి తొల‌గించేలా చేయ‌డానికి తాను ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాన‌ని చెప్పారు.

చాలా సార్లు ఆయా సామాజిక మాధ్య‌మాల సంస్థ‌ల‌కు ఫిర్యాదులు చేశాన‌ని వివ‌రించారు. సామాజిక మాధ్య‌మాల్లో ఎవ‌రో ఒక‌రు పెట్టిన స‌మాచారం అబ‌ద్ధ‌మ‌ని నిరూపించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని ఆయ‌న చెప్పారు. ఇటువంటివి ఆన్‌లైన్‌లో రాకుండా చూసుకునేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

కాగా, బ‌న్నీ వాసు ఇటీవ‌ల ప‌దే ప‌దే వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. బన్నీ వాసు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనను మోసం చేశాడంటూ చాలా కాలంగా ఓ మ‌హిళ ఆరోపణలు చేసింది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి వెళ్లి హల్‌చ‌ల్ చేయ‌డంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు.