పచ్చగా మారిన 12 ఏళ్ల బాలుడి నాలుక.. టెస్ట్​ చేస్తే తేలిందిదీ!

25-07-2021 Sun 12:32
  • కోల్డ్ అగ్లుటినిన్ బారిన చిన్నారి
  • ఎర్ర రక్తకణాలను చంపేసే రోగనిరోధక వ్యవస్థ
  • ఎప్ స్టైన్ బార్ వైరస్ వల్ల వచ్చిందన్న వైద్యులు
Boy Tongue Changed To Yellow Suffered Auto Immune Disorder

మామూలుగా కామెర్లు వస్తే కళ్లు పచ్చగా మారుతాయి. కానీ, కెనడాకు చెందిన ఓ 12 ఏళ్ల చిన్నారికి మాత్రం నాలుక పసుపు పచ్చగా అయిపోయింది. మూత్రం ఎర్రగా వస్తోంది. దీనికి కారణం ఎర్ర రక్తకణాలను మన రోగనిరోధక వ్యవస్థ చంపేసే అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని వైద్యులు తేల్చారు.

బొంగురు గొంతు, ఎర్రటి మూత్రం, కడుపు నొప్పి, చర్మం వాడిపోవడం వంటి సమస్యలు ఉండడంతో సిక్ చిల్డ్రన్ ఫర్ టొరంటో అనే ఆసుపత్రికి ఆ బాలుడిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అతడిని చూసిన వైద్యులు.. తొలుత కామెర్లు అనుకున్నారు. అయితే, నాలుక పచ్చగా మారడం చూసి.. మరిన్ని పరీక్షలు చేయించారు. రక్తహీనత ఉందని నిర్ధారించారు. దానితో పాటు పిల్లలకు సాధారణంగా వ్యాపించే ‘ఎప్ స్టైన్ బార్ వైరస్’ ఇన్ ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించారు.

దాంతో పాటు మంచి చేసే ఎర్ర రక్తకణాలను చంపేసే ‘కోల్డ్ అగ్లుటినిన్’ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్నట్టు తేల్చారు. శీతల వాతావరణం వల్ల ఈ జబ్బు వస్తుందని చెబుతున్న వైద్యులు.. ఈ బాలుడి విషయంలో మాత్రం ఎప్ స్టైన్ బార్ వైరస్ వల్లే వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోల్డ్ అగ్లుటినిన్ వల్ల రక్తహీనత వస్తుందని, ఎర్ర రక్తకణాలు దెబ్బ తింటాయని చెప్పారు.

రక్తకణాలు చనిపోవడం వల్ల ఒంట్లో బిలిరుబిన్ పేరుకుపోతుందని, కామెర్లు వస్తాయని తెలిపారు. బాలుడికి రక్తం ఎక్కించి చికిత్స చేశారు. రోగనిరోధక వ్యవస్థ అతి కార్యకలాపాలను తగ్గించేందుకు 7 వారాల పాటు స్టీరాయిడ్లు ఇచ్చారు. ఆ అబ్బాయి ప్రస్తుతం కోలుకున్నాడు. మెల్లమెల్లగా అతడి నాలుక మీద ఉన్న పసుపు రంగు కూడా పోయింది.