మా పోరాటానికి మరింత ఆదరణ తీసుకొచ్చినందుకు చిన్న దొరగారి సైన్యానికి ధన్యవాదాలు: ష‌ర్మిల చుర‌క‌లు

25-07-2021 Sun 11:24
  • యువకుల ఆత్మహత్యలు ఆపడం కోస‌మే మా పోరాటం
  • చిన్న దొరగారు మొద‌ట‌ ఆడవాళ్లు వ్రతాలే చేసుకోవాల‌న్నారు
  • నిన్నటి పుట్టినరోజు శుభాకాంక్షలకు ఉలిక్కిపడి లేచారు
  • కేటీఆర్ సైన్యం వ్యక్తిగత దూషణతో మా పోరాట స్ఫూర్తిని మరింత పెంచింది
sharmila slams ktr

తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే హృదయాన్ని, ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదలను ఆయ‌న‌కు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్న‌ట్లు నిన్న వైఎస్‌ ష‌ర్మిల ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఆమె మ‌రోసారి స్పందించారు. తాను ఉద్యోగాలు ఇవ్వాల‌ని కోరినందుకు కేటీఆర్ మ‌ద్ద‌తుదారులు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు పాల్ప‌డ్డార‌ని ఆమె చెప్పారు.

'గళమెత్తిన శ్రీకాంత్ లాంటి యువకుల ఆత్మహత్యలు ఆపడం కోస‌మే మా పోరాటం. చిన్న దొరగారు మొద‌ట‌ ఆడవాళ్లు వ్రతాలే చేసుకోవాల‌న్నారు. నిన్నటి పుట్టినరోజు శుభాకాంక్షలకు ఉలిక్కిపడి లేచి నిరుద్యోగుల సమస్యలపైన మా పోరాటానికి మరింత ఆదరణ తీసుకొచ్చినందుకు కేటీఆర్ గారి సైన్యానికి ధన్యవాదాలు' అని ష‌ర్మిల చుర‌క‌లంటించారు.
 
'మీ వ్యక్తిగత దూషణతో మా పోరాట స్ఫూర్తిని మరింత పెంచారు. మా కన్నా మేము ఎంచుకున్న పోరాటం గొప్పది. మీరు మమ్మల్ని అణచివేయాలని ఎంత గింజుకున్నా యువతకు ఉద్యోగాలిప్పించే వరకు మా పోరు సాగుతూనే ఉంటుంది. అంతవరకు మీకు ప్రతిరోజు మీ చేతగానితనాన్ని గుర్తుచేస్తూనే ఉంటాం' అని ష‌ర్మిల ట్వీట్లు చేశారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న యువకుడు గ‌తంలో పాడిన ఓ పాట‌ను ఆమె పోస్ట్ చేశారు.