ఘనంగా ప్రారంభమైన ఉజ్జయిని మహంకాళి బోనాలు.. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని

25-07-2021 Sun 08:55
  • కుటుంబ సభ్యులతో కలిసి బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని
  • తెల్లవారుజాము నుంచే పెరిగిన భక్తుల దాడి
  • కరోనా నుంచి బయటపడేలా చూడమని అమ్మవారిని కోరానన్న మంత్రి
  • నేడు, రేపు ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Minister Talasani offers Bangaru Bonam to Goddes Mahakali

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఈ ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మంత్రి ఉజ్జయిని అమ్మవారికి బంగారు బోనం సమర్పించి పూజలు చేశారు. బోనాల నేపథ్యంలో నేడు, రేపు ఆలయ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పండుగ నేపథ్యంలో భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

బోనాల జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. వేడుకలను తిలకించేందుకు ప్రధాన ప్రాంతాల్లో  భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. బోనం సమర్పించిన అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రజలను చల్లగా చూడాలని, కరోనా బారి నుంచి బయటపడేలా అనుగ్రహించాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. కరోనా నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలో మాస్కులు అందజేస్తున్నారు.