ఒలింపిక్ పతకం నెగ్గిన మీరాబాయి చానుకు రూ.కోటి నజరానా ప్రకటించిన మణిపూర్ సీఎం

24-07-2021 Sat 22:07
  • టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు తొలిపతకం
  • వెయిట్ లిఫ్టింగ్ లో రజతం సాధించిన చాను
  • ఉప్పొంగిన యావత్ భారతావని
  • ప్రశంసల వర్షం కురిపించిన మణిపూర్ సీఎం
Manipur CM announces one crore rupees for Olympic medalist Mirabai Chanu

టోక్యోలో భారత్ కు పతకాల బోణీ చేసిన మణిపూర్ అమ్మాయి మీరాబాయి చానుపై ప్రశంసల జడివాన కురుస్తోంది. తాజాగా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ భారీ నజరానా ప్రకటించారు. దేశ, రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తూ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశంలో రజతం గెలిచిన మీరాబాయి చానుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.1 కోటి అందించనున్నట్టు వెల్లడించారు.

ఈశాన్య రాష్ట్రాల సీఎంల సమావేశం జరుగుతుండగా చాను పతకం నెగ్గిందన్న సమాచారం అందిందని  వెల్లడించారు. ఇదే విషయాన్ని ఆయన చానుకు స్వయంగా ఫోన్ చేసి వివరించారు. మిగతా రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఈ వార్త తమను ఎంతో ఆనందానికి గురిచేసిందని ఆమెకు చెప్పారు.

"ఇకపై నువ్వు రైల్వే స్టేషన్ల వద్ద టికెట్ కలెక్టర్ గా పనిచేయాల్సిన అవసరం లేదు... నీ కోసం ప్రత్యేక ఉద్యోగం సిద్ధం చేసి ఉంచాం. హోంమంత్రితో సమావేశం అనంతరం నిన్ను ఆశ్చర్యపరిచే అంశం వెల్లడిస్తాం" అని చానుకు వివరించారు.

చాను స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మొత్తం 202 కేజీలు ఎత్తి రజతం గెలవడంతో, ఆమె ఘనత పట్ల దేశం ఉప్పొంగిపోయింది. కాగా, ఈ విభాగంలో చైనాకు చెందిన ఝి హుయి హౌ మొత్తం 210 కేజీలు ఎత్తి స్వర్ణం చేజిక్కించుకుంది. తద్వారా ఒలింపిక్ రికార్డును కూడా నమోదు చేసింది. ఇండోనేషియాకు చెందిన కాంతికా ఐసా 194 కేజీలు ఎత్తి కాంస్యం దక్కించుకుంది.