ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు వెంకట్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి

24-07-2021 Sat 18:58
  • ఇటీవల కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్
  • గాయపడిన వెంకట్ బల్మూర్
  • పోలీసుల అత్యుత్సాహమే కారణమన్న రేవంత్
  • డీజీపీకి, హెచ్చార్సీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడి
Revanth Reddy visits injured NSUI President Venkat Balmoor

రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్ కార్యకలాపాల్లో దూకుడు పెరిగింది. కాగా, ఇటీవల హైదరాబాదులో కాంగ్రెస్ శ్రేణులు పెగాసస్ వ్యవహారంలో చేపట్టిన ఛలో రాజ్ భవన్ కార్యాచరణ సందర్భంగా ఎన్ఎస్ యూఐ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ గాయపడ్డారు. ఈ నేపథ్యంలో, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ వెంకట్ ను ఆయన నివాసంలోనే పరామర్శించారు.

పోలీసుల దుందుడుకు వైఖరి కారణంగానే వెంకట్ కు గాయాలు అయ్యాయని ఆరోపించారు. వెంకట్ పక్కటెముకలను లక్ష్యంగా చేసుకుని కొట్టారని వెల్లడించారు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో వెంకట్ చురుగ్గా పాల్గొంటున్నందుకే అతనిని టార్గెట్ చేశారని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీకి, హెచ్చార్సీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాగా, వెంకట్ కు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలను, పక్కటెముకల ఎక్స్ రేలను రేవంత్ ఈ సందర్భంగా పరిశీలించారు. వెంకట్ త్వరగా కోలుకుని, మళ్లీ చురుగ్గా కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.