కోర్టు ధిక్కార కేసులో మరో ఐఏఎస్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు

24-07-2021 Sat 17:41
  • ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణను అరెస్ట్ చేయాలని ఆదేశం
  • రూ. 50 వేల జరిమానా విధింపు
  • జైలు శిక్షను నిలిపివేయాలని కోర్టును కోరిన సత్యనారాయణ
AP high court fines IAS on court contempt reasons

కోర్టు ధిక్కార కేసులో రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణను అరెస్ట్ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా కలిదిండి పంచాయతీ కార్యదర్శి శ్రీమన్నారాయణకు బకాయిలు చెల్లించాలని గతంలోనే కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను సత్యనారాయణ అమలు చేశారు. అయితే గత వాయిదాకు ఆయన ఆలస్యంగా హాజరయ్యారు. దీంతో, ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. దీంతో ఈరోజు కోర్టుకు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఆయితే ఆయన పెట్టుకున్న రీకాల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

కోర్టు ధిక్కారం నేపథ్యంలో రూ. 50 వేల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని హైకోర్టు తెలిపింది. రూ. 50 వేల జరిమానాను న్యాయవాదుల సంక్షేమ నిధికి చెల్లించాలని సూచించింది. అయితే జైలు శిక్షను నిలిపివేయాలని సత్యనారాయణ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో, ఈ విషయాన్ని పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.