సెన్సార్ పూర్తిచేసుకున్న 'తిమ్మరుసు'

24-07-2021 Sat 17:24
  • 'తిమ్మరుసు'గా సత్యదేవ్
  • కొత్త దర్శకుడి పరిచయం
  • ఈ సినిమాపై ప్రియాంక ఆశలు
  • ఈ నెల 30వ తేదీన విడుదల      
Thimmarusu movie censor completed

సత్యదేవ్ హీరోగా ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై 'తిమ్మరుసు' సినిమా నిర్మితమైంది. ఈ సినిమా ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ ను ఇచ్చారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

మొదటి నుంచి కూడా సత్యదేవ్ విభిన్నమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఇంతవరకూ ఆయన చేసిన సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. 'తిమ్మరుసు' సినిమాలోను ఆయన ఒక విలక్షణమైన పాత్రను పోషించాడు. ఈ సినిమాతో శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఈ సినిమాలో సత్యదేవ్ సరసన నాయికగా ప్రియాంక జవాల్కర్ నటించింది. 'టాక్సీవాలా' సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ, సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది. తన నిరీక్షణ ఈ సినిమాతో ఫలిస్తోందని ఆమె భావిస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.