టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని అడ్డుకున్న గ్రామస్థులు

24-07-2021 Sat 17:13
  • ముత్తిరెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న రత్నతండా గ్రామస్థులు 
  • రోడ్డు వేస్తామని చెప్పి ఎందుకు వేయలేదని నిలదీత
  • పోలీసులు, గ్రామస్థులకు మధ్య తోపులాట
TRS MLA Muthireddy faces bitter experience

టీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రత్నతండా గ్రామస్థులు ఆయనను అడ్డుకున్నారు. తమ గ్రామానికి రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఎందుకు వేయలేదని గ్రామస్థులు ముత్తిరెడ్డిని నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
 
నర్మెట్ట మండలం మచ్చుపహాడ్ రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీశాఖ ఆధ్వర్యంలో 10 మొక్కలను నాటే కార్యక్రమానికి ముత్తిరెడ్డి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగపేట గ్రామంలో రత్నతండాకు చెందిన ప్రజలు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా పోలీసులకు, గ్రామస్థులకు మధ్య తోపులాట జరిగింది. రోడ్డు ఇంతవరకు ఎందుకు వేయలేదని ఎమ్మెల్యేను గ్రామస్థులు ప్రశ్నించారు. ఈ క్రమంలో కారు దిగొచ్చి... ఆందోళన చేస్తున్న వారికి ముత్తిరెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.