'బిగ్ బాస్ ఓటీటీ'కి హోస్టుగా ప్రముఖ ఫిలిం మేకర్!

24-07-2021 Sat 17:10
  • voot ఓటీటీలో హిందీ 'బిగ్ బాస్' షో
  • హోస్టుగా దర్శకనిర్మాత కరణ్ జొహార్
  • ఆగస్టు 8న షో ప్రీమియర్ స్ట్రీమింగ్
  • 'ఇది అమ్మ కల' అంటున్న కరణ్  
Karan Johar will host Big Boss show

ఇండియన్ టెలివిజన్ రియాలిటీ షోలలో 'బిగ్ బాస్' షోకు వున్న ప్రత్యేకతే వేరు. బుల్లితెర ప్రేక్షకులను ఆ కాన్సెప్ట్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. దానికి తోడు, హోస్టుగా పాప్యులర్ తారలు.. నిర్మాణంలో రిచ్ నెస్..  మరింతగా ఆకట్టుకుంటాయి. అందుకే, ఏ భాషలో ఈ షోను రూపొందించినా విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది.

ఇక హిందీ 'బిగ్ బాస్' షో గురించి అయితే చెప్పేక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన వాక్చాతుర్యంతో అన్ని సీజన్లలోనూ ఆ షోను మరింతగా రక్తికట్టిస్తూ వచ్చాడు. అయితే, ఇప్పుడు ఈ హిందీ బిగ్ బాస్ షోకి హోస్టుగా కొత్తగా ఓ బడా ఫిలిం మేకర్ వస్తున్నాడు. అతనే దర్శక నిర్మాత కరణ్ జొహర్!

కొత్త సీజన్ 'బిగ్ బాస్' షోకి కొన్ని ఎపిసోడ్లకు కరణ్ హోస్టుగా వ్యవహరిస్తాడు. వీటిని టీవీలో కాకుండా, VOOT ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 8న ఈ షో ప్రీమియర్ స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో ప్రసారం అయ్యే కొన్ని ఎపిసోడ్లకు మాత్రమే కరణ్ హోస్టుగా ఉంటాడనీ, అనంతరం 'కలర్స్' టీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్లకు మాత్రం మళ్లీ యథావిధిగా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తాడని సమాచారం.

దీనిపై కరణ్ స్పందిస్తూ, "బిగ్ బాస్ షోకి మా అమ్మ, నేను పెద్ద ఫ్యాన్స్. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చూస్తాం. బిగ్ బాస్ షోకి నేను హోస్ట్ చేస్తే చూడాలన్నది మా అమ్మ కల. అది ఇప్పుడు నెరవేరుతోంది. మామూలుగా షోస్ హోస్ట్ చేయడాన్ని నేను ఎంతో ఎంజాయ్ చేస్తాను. అందుకే, బిగ్ బాస్ అభిమానులను నేను అలరించగలనని, వాళ్ల అంచనాలను చేరుకోగలనని నమ్ముతున్నాను" అని చెప్పాడు.