సోనియాగాంధీని కలిసిన తర్వాత కమిటీల గురించి మాట్లాడతా: వీహెచ్

24-07-2021 Sat 15:44
  • నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎందరో నేతలు వచ్చి కలిశారు
  • సోనియాగాంధీ కూడా ఫోన్ ద్వారా పరామర్శించారు
  • పవన్ కల్యాణ్ నాకు లేఖ రాశారు
Will speak about PCC after meeting with Sonia says VH

అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన తర్వాత తనను కలిసేందుకు ఎంతో మంది నాయకులు హాస్పిటల్ కు వచ్చారని కాంగ్రెస్ సీనియన్ నేత వి.హనుమంతరావు చెప్పారు. వారందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. తమ అధినేత్రి సోనియాగాంధీ కూడా తనను ఫోన్ ద్వారా పరామర్శించారని చెప్పారు. బడుగు, బలహీనవర్గాల వారికి తన సేవలు అవసరమని సోనియా అన్నారని వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని, డబ్బులు సంపాదించడానికి రాలేదని చెప్పారు.
 
సోనియాగాంధీ తనతో మాట్లాడటం తనలోని ధైర్యాన్ని మరింత పెంచిందని వీహెచ్ అన్నారు. తన తుదిశ్వాస వరకు బలహీన వర్గాలకు సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఆపద ఎక్కడ ఉంటే అక్కడ తాను ఉంటానని చెప్పారు. సోనియాగాంధీని వ్యక్తిగతంగా కలిసిన తర్వాత పాత పీసీసీ, కొత్త పీసీసీ గురించి మాట్లాడతానని అన్నారు. అప్పటి వరకు ఏమీ మాట్లాడనని చెప్పారు. తన ఆరోగ్యం విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు లేఖ రాశారని తెలిపారు. పేదవారు ఆపదలో ఉంటే ఆదుకునే గుణం పవన్ కల్యాణ్ ది అని కితాబునిచ్చారు.