గతంలో డెయిరీ నిర్వహించిన బ్రహ్మనాయుడు సంగం డెయిరీపై విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉంది: ధూళిపాళ్ల

24-07-2021 Sat 14:22
  • మరోసారి తెరపైకి సంగం డెయిరీ వ్యవహారం
  • తమపై బొల్లా బ్రహ్మనాయుడు విమర్శలు చేశారన్న ధూళిపాళ్ల
  • విషయ పరిజ్ఞానం లేని వ్యాఖ్యలని వెల్లడి
  • సంస్కారం ఉండాలని హితవు
Dhulipalla strong reply to YCP MLA Bolla Brahmanaidu

సంగం డెయిరీ వ్యవహారంలో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. ఈ క్రమంలో సంగం డెయిరీపై వినుకొండ శాసనసభ్యుడు, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు చేసిన వ్యాఖ్యలకు ధూళిపాళ్ల బదులిచ్చారు. పాడిరైతులకు ఇచ్చే బోనస్ లు, ఇతర ప్రోత్సాహకాల గురించి బ్రహ్మనాయుడు అర్థరహితంగా మాట్లాడారని విమర్శించారు. ఆయన మాటలు చూస్తే కనీస విషయ పరిజ్ఞానం లేనట్టుగా అర్థమవుతోందని అన్నారు.

గతంలో బ్రహ్మనాయుడు కూడా డెయిరీ నిర్వహించారని, కానీ ఇప్పుడాయన సంగం డెయిరీపై చేసిన వ్యాఖ్యలు వింటుంటే ఆశ్చర్యంగా ఉందని ధూళిపాళ్ల పేర్కొన్నారు. పదవిని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేయొచ్చన్న ధోరణిలో వెళుతున్నారని విమర్శించారు. సంగం డెయిరీ సంపూర్ణ రీతిలో రైతుల అభ్యున్నతి కోసం ఎలా కృషి చేస్తుందో బ్రహ్మనాయుడు తెలుసుకోవాలని హితవు పలికారు. తాము మొదటి నుంచి చెబుతున్నది ఒకటేనని, సంగం డెయిరీ రైతుల డెయిరీ అని, తాము దానికి కాపలాదారులం మాత్రమేనని ధూళిపాళ్ల స్పష్టం చేశారు.

డెయిరీ సమావేశంలో పాడిరైతుల విషయాలు మాట్లాడుకుంటే వినుకొండ శాసనసభ్యుడికి ఎందుకంత ఆవేశం వచ్చిందో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. "నా పైనా, నా కుటుంబం పైనా ఆరోపణలు చేశారు. డబ్బు ఉండగానే సరిపోదు... సంస్కారం కూడా ఉండాలి" అని హితవు పలికారు. మనుషులు, కుటుంబాల గురించి తెలియని వ్యక్తి అని ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందని విమర్శించారు.