మీరాబాయి ప్రదర్శనతో దేశమంతా ఉప్పొంగిపోతోంది: ప్రధాని ప్రశంసలు

24-07-2021 Sat 13:50
  • మీరాబాయి చానుకు ప్రముఖుల అభినందనలు
  • శుభాకాంక్షలు చెప్పిన రాష్ట్రపతి, ప్రధాని
  • ఈ విజయం భారతీయులందరికీ స్ఫూర్తి అన్న మోదీ
  • బరువులే కాదు.. దేశాన్నీ అంతెత్తుకు ఎత్తిందన్న ఛెత్రి
Nation Congratulates Silver Winner Meerabai Chanu

భారత్ కు తొలి పతకాన్ని అందించిన మీరాబాయి చానుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి, ప్రధాని, రాజకీయ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ లో పతకాల ఖాతా తెరిచిన మీరాబాయి చానుకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభినందించారు.

‘‘ఇంతకన్నా ఆనందం ఇంకేముంటుంది? మీరాబాయి ప్రదర్శనతో దేశమంతా ఉప్పొంగిపోతోంది. వెయిట్ లిఫ్టింగ్ లో దేశానికి రజత పతకం అందించిన ఆమెకు శుభాకాంక్షలు. ఆమె విజయం భారతీయులందరిలోనూ స్ఫూర్తిని నింపుతుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. పతకం కోసం బరువులు మాత్రమే ఎత్తలేదు.. దేశాన్నే అంతెత్తుకు ఎత్తావు అంటూ ఫుట్ బాల్ కెప్టెన్ సునిల్ ఛెత్రి అభినందించాడు.  

ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి ఆమె దేశం గర్వపడేలా చేసిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొనియాడారు. ఇది చాలా మంచి విజయం, చాలా మంచి రోజని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ అన్నారు. ఈ విజయం భారత క్రీడాకారుల్లో నైతిక స్థైర్యాన్ని నింపుతుందని రెజ్లర్ బజ్రంగ్ పూనియా అన్నాడు.

క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఆమెను అభినందనలతో ముంచెత్తాడు. గాయం నుంచి కోలుకుని మరీ పతకం సాధించి చరిత్ర సృష్టించావంటూ కొనియాడాడు. వెయిట్ లిఫ్టింగ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచావని పేర్కొన్నాడు. టీమిండియా దూసుకెళ్లాలని ఆకాంక్షించాడు. పరుగుల రాణి పీటీ ఉష.. ఆమెకు శుభాకాంక్షలు చెప్పింది.