వైయస్ వివేకా హత్య కేసు.. రంగన్నతో తనకు పరిచయం లేదన్న ఎర్ర గంగిరెడ్డి

24-07-2021 Sat 13:22
  • సీబీఐ విచారణలో కీలక విషయాలను వెల్లడించిన వాచ్ మెన్ రంగన్న
  • పేరు చెపితే చంపేస్తానని గంగిరెడ్డి హెచ్చరించినట్టు వెల్లడి
  • తాను ఎవరినీ బెదిరించలేదన్న గంగిరెడ్డి
I dont know Ranganna says Erra Gangireddy

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిపై (వివేకా ముఖ్య అనుచరుడు)... వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న అలియాస్ రంగయ్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వివేకాది సుపారి హత్య అని సీబీఐ విచారణలో ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు తన పేరును వెల్లడిస్తే చంపేస్తానని ఎర్ర గంగిరెడ్డి తనను హెచ్చరించినట్టు తెలిపారు. అందుకే భయపడి తాను ఏమీ చెప్పలేదని అన్నారు. తనపై ఈగ కూడా వాలనివ్వబోమని సీబీఐ అధికారులు చెప్పారని తెలిపారు. రంగన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

రంగన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి స్పందించారు. రంగన్నతో తనకు పరిచయమే లేదని చెప్పారు. తాను ఎవరినీ బెదిరించలేదని అన్నారు. వివేకానందరెడ్డికి ద్రోహం చేసే వ్యక్తిని కాదని... ఆయన హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తాను బెదిరించినట్టు ఇప్పటి వరకు కడపలో కానీ, పులివెందులలో కానీ కేసులు లేవని అన్నారు.
 
మరోవైపు ఈ హత్య వెనుక ఇద్దరు కీలక వ్యక్తులు ఉన్నారని రంగన్న చేసిన వ్యాఖ్యలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఆ ఇద్దరు ఎవరు? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.