శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం

23-07-2021 Fri 21:02
  • గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు
  • కృష్ణమ్మ పరవళ్లు
  • శ్రీశైలం ప్రస్తుత ఇన్ ఫ్లో 1.92 లక్షల క్యూసెక్కులు
  • ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పాదన
Huge flood waters at Srisailam project

గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది మహోగ్రంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం వద్ద ఇన్ ఫ్లో 1,92,035 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 849.9 అడుగుల వరకు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో గరిష్ఠంగా 215.8 టీఎంసీల నీరు నిల్వ చేయొచ్చు. ప్రస్తుతం ఇక్కడ 77.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కాగా, శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి చేసి 31,783 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు, తెలంగాణలో గోదావరి పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద 26.5 అడుగుల నీటిమట్టం నమోదైంది. నీటి ప్రవాహం 3,43,132 క్యూసెక్కులకు పెరిగింది.