ఏం అవగాహన ఉందని సజ్జల కేంద్రం నోటిఫికేషన్ ను స్వాగతిస్తారు?: సోమిరెడ్డి

23-07-2021 Fri 20:46
  • నదీ యాజమాన్య బోర్డులపై కేంద్రం నోటిఫికేషన్
  • స్వాగతిస్తున్నట్టు పేర్కొన్న సజ్జల
  • తీవ్రంగా స్పందించిన సోమిరెడ్డి
  • కొంచమైనా జ్ఞానముందా? అంటూ ఆగ్రహం
Somireddy questions Sajjala

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల అధికారాలను వివరిస్తూ కేంద్రం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం తెలిసిందే. కేంద్రం ప్రకటనను స్వాగతిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

సజ్జలకు ఏం తెలుసని కేంద్రం నోటిఫికేషన్ ను స్వాగతిస్తారని సోమిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన చీఫ్ ఇంజినీర్లది కూడా అదే వైఖరి అని, కొంచెమైనా జ్ఞానం ఉందా? అని విమర్శించారు. రాయలసీమలో ఎకరం సాగు చేసే రైతులకు సమాధానం చెప్పగలరా మీరు? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల భవిష్యత్ ప్రమాదంలో పడిందని అన్నారు. రాష్ట్రాల చేతుల్లో ఉండే ప్రాజెక్టులు కేంద్రం అజమాయిషీలోకి వెళ్లేందుకు కారణం ఎవరని నిలదీశారు.