అలాంటివాళ్లను అవసరమైతే చట్టాలను పక్కనబెట్టి మరీ వేటాడాలి: ఏపీ స్పీకర్ తమ్మినేని

23-07-2021 Fri 19:47
  • శ్రీకాకుళంలో దిశ కార్యక్రమం
  • దిశ యాప్ ద్వారా సమాజంలో మార్పు రావాలన్న తమ్మినేని
  • నాటి దిశ ఎన్ కౌంటర్ ప్రస్తావన
  • మృగాళ్లను క్షమించరాదని వెల్లడి
  • సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను అభినందించిన స్పీకర్ 
AP Speaker Tammineni comments on atrocities over women

శ్రీకాకుళంలో ఇవాళ ఏర్పాటు చేసిన దిశ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పాల్గొన్నారు. దిశ యాప్ ద్వారా సమాజంలో మార్పు రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు తెలంగాణలో సంచలనం సృష్టించిన దిశ ఎన్ కౌంటర్ ఘటనను ప్రస్తావించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను అభినందిస్తున్నట్టు తెలిపారు. సమాజంలో పురుషుల ఆలోచనా ధోరణి మారాలని పిలుపునిచ్చారు.

మృగాలుగా మారిన మగవాళ్లను క్షమించరాదని అన్నారు. అవసరమైతే చట్టాలను పక్కనబెట్టి అలాంటివారిని వేటాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమాజానికి రక్షణ ఇవ్వాల్సిన మగాడే మృగంలా మారితే ఎలా? అని వ్యాఖ్యానించారు. అత్యాచారాలకు పాల్పడే వారు భూమిపై ఉండేందుకు పనికిరారని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాముడు, కృష్ణుడు తిరిగిన పుణ్యభూమిలో ఇలాంటి దుర్మార్గాలు ఏంటని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. నైతికత ఏమాత్రం లేని రీతిలో కన్నతండ్రులే పసిమొగ్గలను చిదిమేస్తున్న ఘటనలు దారుణమని భావోద్వేగాలకు లోనయ్యారు.