విజయసాయిరెడ్డి పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో ఉంచిన తెలంగాణ హైకోర్టు

23-07-2021 Fri 16:59
  • జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ చార్జిషీట్లు
  • తొలుత ఈడీ కేసుల విచారణ చేపట్టాలన్న సీబీఐ కోర్టు
  • తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విజయసాయి, జగతి
  • నేటితో వాదనలు పూర్తి
Telangana High Court reserves verdict on Vijayasai and Jagathi Publications petitions

తమపై నమోదైన కేసుల్లో మొదట ఈడీ కేసులను విచారించాలని సీబీఐ కోర్టు నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. దీనిపై గత కొన్ని నెలలుగా విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా నేడు కూడా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

వాదనల సందర్భంగా.... ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి వాదించారు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కేసులు, ఈడీ కేసులు వేర్వేరని తెలిపారు. 2019లో మనీ లాండరింగ్ చట్టాన్ని సవరించారని, ఈ క్రమంలో ముందుగా ఈడీ కేసులు విచారణ జరపాల్సిన అవసరం ఉందని విన్నవించారు. ప్రధాన కేసు నుంచి విడిగా ఈడీ చార్జిషీట్లపై విచారణ జరపాలని కోరారు.

అంతకుముందు, విజయసాయి, జగతి పబ్లికేషన్స్ తరఫున సీనియర్ అడ్వొకేట్ ఎస్.నిరంజన్ రెడ్డి వాదించారు. మొదట ఈడీ కేసులు విచారించాలన్న సీబీఐ-ఈడీ కోర్టు ఆదేశాలను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ కేసులతో ఈడీ కేసులకు సంబంధం ఉందని స్పష్టం చేశారు. సీబీఐ కేసుల ఆధారంగానే ఈడీ విచారణ షురూ అయిందని వెల్లడించారు. తొలుత సీబీఐ కేసులను విచారించాలని, లేనిపక్షంలో సీబీఐ, ఈడీ కేసులను సమాంతరంగా విచారణ జరపాలని కోరారు.