ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాల విడుదల

23-07-2021 Fri 16:34
  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు రద్దు
  • మార్కుల కోసం కమిటీ వేసిన ఏపీ సర్కారు
  • కమిటీ సిఫారసుల మేరకు మార్కుల కేటాయింపు
  • వారం ముందే ఫలితాలు వెల్లడించామన్న మంత్రి సురేశ్
AP Inter Second Year results released

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం నేడు ఫలితాలు వెల్లడించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పరీక్షలు జరగని నేపథ్యంలో కమిటీ సిఫారసుల మేరకు పదో తరగతి మార్కుల ఆధారంగా 30 శాతం వెయిటేజి, ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కుల ఆధారంగా 70 శాతం వెయిటేజితో సెకండియర్ విద్యార్థులకు మార్కులు, తదనుగుణంగా గ్రేడ్లు కేటాయించామని వివరించారు.

ఇంటర్ సెకండియర్ లో 5,08,672 మంది విద్యార్థులు ఉండగా, అందరూ ఉత్తీర్ణులైనట్టు మంత్రి వెల్లడించారు. ఎవరైనా ఈ ఫలితాల పట్ల సంతృప్తి చెందకపోతే, వారికి తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కాగా, సుప్రీంకోర్టు ఈ నెల 31 లోపు పరీక్ష ఫలితాలు వెల్లడించాలని ఆదేశించిందని, తాము వారం రోజుల ముందే ఫలితాలు విడుదల చేశామని తెలిపారు.