దోమల కోసం పొగ వేస్తే... మనిషి ప్రాణం పోయింది!

23-07-2021 Fri 15:13
  • చెన్నైలో విషాదకర ఘటన
  • ఇంట్లో పొగపెట్టి, ఏసీ వేసుకుని పడుకున్న కుటుంబసభ్యులు
  • పొగకు నిద్రలోనే స్పృహ కోల్పోయిన వైనం
One woman dies with smoke set for mosquitos

దోమలను తరిమికొట్టేందుకు వేసిన పొగ ఒక మనిషి ప్రాణాన్ని బలిగొన్న విషాదకర ఘటన చెన్నైలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే చెన్నైలోని తిరువళ్లువర్ ప్రాంతానికి చెందిన చొక్కలింగం (53) ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉండటంతో ఆయన భార్య పుష్పలక్ష్మి ప్లేట్ లో బొగ్గులు ఉంచి దానిలో నూనె పోసి నిప్పు పెట్టారు. ఆ తర్వాత ఏసీ ఆన్ చేసుకుని కుటుంబసభ్యులు నిద్రపోయారు. అయితే బయటకు వెళ్లే దారిలేక పొగ గది అంతా వ్యాపించింది. ఆ పొగ వల్ల వారందరూ నిద్రలోనే స్పృహ కోల్పోయారు.

తెల్లవారిన తర్వాత వారు ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో స్థానికులు తలుపులు తట్టారు. అయితే లోపల నుంచి స్పందన రాకపోవడంతో...  తలుపు బద్దలుకొట్టుకుని లోపలకు వెళ్లారు. అప్పటికే పుష్పలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో, వారిని వెంటనే చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.