Olympics: ఆదిలోనే హంసపాదు.. టోక్యో ఒలింపిక్స్​ ఆర్చరీలో మనవాళ్లకు తక్కువ ర్యాంకులు

  • ర్యాంకింగ్ రౌండ్ లో నిరాశ
  • అతాను దాస్ కు 35వ ర్యాంక్
  • అతని కన్నా మెరుగైన స్థానంలో ప్రవీణ్ జాధవ్
  • 31వ ర్యాంకు సాధించిన అరంగేట్ర అథ్లెట్
  • మిక్స్ డ్ డబుల్స్ లో దీపిక, ప్రవీణ్ లకు 9వ ర్యాంకు
Tokyo Olympics Setback For Indian Archers In Ranking Round

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పోటీల ప్రారంభానికి ముందు ఆర్చరీలో నిర్వహించే ర్యాంకింగ్ రౌండ్ లో భారత ఆర్చర్లు వెనుకబడ్డారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అతాను దాసు 35వ స్థానానికి పరిమితమయ్యాడు. 72 బాణాలు సంధించాక 653 పాయింట్లు సాధించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన ప్రవీణ్ జాధవ్.. అతాను కన్నా మెరుగైన స్థానంలో నిలిచాడు. 656 పాయింట్లతో 31వ ర్యాంకు సాధించాడు. 652 పాయింట్లు సాధించిన తరుణ్ దీప్ రాయ్ 37వ ర్యాంకును పొందాడు.

జట్టు పరంగా భారత్ కు 9వ ర్యాంకు లభించింది. మొత్తం పాయింట్లు 1961 వచ్చాయి. మిక్స్ డ్ ఈవెంట్ లో ప్రవీణ్ జాధవ్, దీపికా కుమారిలకు 1319 పాయింట్లు రాగా.. 9వ ర్యాంకు సాధించారు. ఈ ర్యాంకుల ఆధారంగానే పోటీలను నిర్ణయించారు. చైనీస్ తైపీకి చెందిన 30వ ర్యాంకర్ వై.సి. డెంగ్ తో అతాను దాస్ తలపడనున్నాడు. రష్యాకు చెందిన జి. బజార్ఝపోవ్ (34వ ర్యాంక్)తో ప్రవీణ్ జాధవ్, ఉక్రెయిన్ కు చెందిన ఒ. హన్బిన్ (28వ ర్యాంక్)తో తరుణ్ దీప్ రాయ్ లు తలపడనున్నారు. 64వ రౌండ్ లో వారు పోటీ పడనున్నారు.

కాగా, మహిళల రౌండ్ లో దీపికా కుమారి.. 10 రౌండ్లు ముగిసేసరికి 9వ స్థానంలో నిలిచింది. 616 పాయింట్లు సాధించిన ఆమె.. 60 బాణాలను సంధించింది. మొత్తంగా జాబితాలో కొరియాకు చెందిన యాన్ శాన్ (680 పాయింట్లు/మహిళ), కిమ్ జి డియాక్ (688 పాయింట్లు/పురుషుడు) మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో అమెరికాకు చెందిన ఆర్చర్లు బ్రౌన్ మెకంజీ (మహిళ), ఎలిసన్ బ్రాడీ (పురుషుడు) ఉన్నారు.  

  ర్యాంకింగ్ రౌండ్ అంటే...! 

మామూలుగా ఒలింపిక్స్ లో విలువిద్య పోటీలు ఈ ర్యాంకింగ్ రౌండ్ తోనే మొదలవుతాయి. అందులో భాగంగా ఒక్కో ఆర్చర్ 12 వైపులా 72 బాణాలను సంధించాల్సి ఉంటుంది. 70 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించాలి. ఒక్కో వైపున ఆరు బాణాలను 2 నిమిషాల్లోగా సంధించాలి. మొత్తంగా 24 నిమిషాల్లోపు అన్ని వైపులా 72 బాణాలను లక్ష్యంవైపు గురి చూసి కొట్టాలి.

అన్ని బాణాలూ లక్ష్యాన్ని కచ్చితమైన ప్రదేశంలో ఛేదిస్తే ఒక్కో బాణానికి పది పాయింట్ల చొప్పున 720 పాయింట్లు ఇస్తారు. ఆ పాయింట్ల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. ప్రస్తుతం 128 మంది ఆర్చర్లు (64 మంది పురుషులు, 64 మంది మహిళలు) ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు. ర్యాంకుల ఆధారంగా.. చివరి ర్యాంకర్ తో ఫస్ట్ ర్యాంకర్, చివరి నుంచి రెండో ర్యాంకర్ తో టాప్ 2లో నిలిచిన ఆర్చర్ లు పోటీ పడతారు.

More Telugu News