హాట్ స్టార్ లోనే నయనతార 'నేత్రికన్' రిలీజ్!

23-07-2021 Fri 12:17
  • అంధురాలి పాత్రలో నయన్
  • దర్శకుడిగా మిలింద్ రావ్
  • వరుస హత్యల నేపథ్యంలో కథ
  • త్వరలో హాట్ స్టార్ లో రిలీజ్
Nethrikann movie release update
తెలుగు .. తమిళ భాషల్లో నయనతారకి విపరీతమైన క్రేజ్ ఉంది. కొంతకాలంగా ఆమె నాయిక ప్రధానమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది. అలా ఆమె చేసిన సినిమానే 'నేత్రికన్'. ఈ సినిమాలో ఆమె అంధురాలిగా కనిపిస్తుంది. అందమైన అమ్మాయిలను వేటాడి వరుస హత్యలు చేసే ఒక కిల్లర్ బారి నుంచి నాయిక ఎలా తప్పించుకుంది? ఆ కిల్లర్ కథకి ఆమె ఎలాంటి ముగింపు పలికింది? అనేదే కథ.

హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో మిలింద్ రావ్ సిద్ధహస్తుడు. ఆయన ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించాడు. విఘ్నేశ్ శివన్ ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమా 'డిస్నీ హాట్ స్టార్' ద్వారా విడుదల కానుందనే వార్తలు ఇటీవల వినిపించాయి. ఆ తరువాత ఆ ప్రస్తావన ఎక్కడా లేకపోవడంతో అందులో నిజం లేదనుకున్నారు. కానీ ఈ సినిమాను తాము రిలీజ్ చేయనున్నట్టు నిన్న హాట్ స్టార్ వారు స్పష్టం చేశారు.

నయనతార నాయిక ప్రధానమైన సినిమా అంటే, కొత్తదనంతో కూడిన కంటెంట్ ఉంటుందనే నమ్మకం అందరిలో ఉంది. జయాపజయాల సంగతి అటుంచితే, ఆమె ఎంచుకున్న కథలు .. పాత్రలు డిఫరెంట్ గా ఉంటాయి. ఇక నయనతార ఏ పాత్రలో ఉన్నా, ఆ పాత్ర తప్ప తెరపై ఆమె కనిపించదు. అందువలన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. ఇక హాట్ స్టార్ వారు ఈ సినిమాను ఎప్పుడు వదులుతారో చూడాలి.