అధిక వేడిమి నుంచి ఉపశమనం కోసం కృత్రిమంగా వర్షం కురిపించిన దుబాయ్

22-07-2021 Thu 21:40
  • దుబాయ్ లో మండే ఎండలు
  • 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు
  • క్లౌడ్ సీడింగ్ చేసిన అధికారులు
  • డ్రోన్ల సాయంతో వర్షాలు
Dubai gets artificial rains to beat heat wave

ఎడారి దేశం దుబాయ్ లో ఎండలు మండిపోతున్నాయి. ఓ దశలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల సాయంతో కృత్రిమంగా వర్షాలు కురిపించింది. యూఏఈలోని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ నిపుణులు డ్రోన్ల సాయంతో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ చేపట్టి వర్షాన్ని కురిపించారు.

ఈ టెక్నాలజీ సాయంతో మేఘాలను విద్యుదావేశానికి గురిచేస్తారు. దాంతో మేఘాలు కరిగి, అధిక వర్షపాతాన్నిస్తాయి. ఈ డ్రోన్ క్లౌడింగ్ సీడింగ్ ప్రక్రియతో దుబాయ్ నగరంలో కృత్రిమ వర్షాలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను అధికారులు ట్విట్టర్ లో పంచుకున్నారు. రికార్డు స్థాయి ఎండలకు గల్ఫ్ దేశాలు పెట్టింది పేరు. దుబాయ్ లో సాలీనా సగటున కేవలం 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది.