CM KCR: తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

  • రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
  • ఎగువ ప్రాంతాల్లోనూ వానలు
  • కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితులపై చర్చ
  • అధికారులకు దిశానిర్దేశం
CM KCR reviews rains in Telangana

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద పెరుగుతోందని అధికారులు సీఎం కేసీఆర్ కు తెలిపారు. ఈ క్రమంలో, సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల మంత్రులు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఆర్మీ హెలికాప్టర్ లో సీనియర్ అధికారులు పరిశీలనకు వెళ్లాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపించాలని అన్నారు. కృష్ణా నది ప్రవాహం కూడా పెరిగే అవకాశాలు ఉండడంతో నాగార్జున సాగర్ డ్యామ్ వద్దకు అధికారులను పంపాలని స్పష్టం చేశారు. సహాయక చర్యల కోసం మరిన్ని హెలికాప్టర్లను తెప్పించాలని, పెద్ద సంఖ్యలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించాలని అధికారులకు సూచించారు. ఆగస్టు 10 వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ నివేదికలు చెబుతున్న నేపథ్యంలో, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ఇక, హైదరాబాదులో వర్షాల గురించి స్పందిస్తూ, నగరంలో లోతట్టు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్ల నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులను సీఎం ఆదేశించారు.

More Telugu News