'ఛలో రాజ్ భవన్' విజయవంతమైంది: రేవంత్ రెడ్డి

22-07-2021 Thu 21:00
  • దేశవ్యాప్తంగా పెగాసస్ ప్రకంపనలు
  • కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు
  • హైదరాబాదులో 'ఛలో రాజ్ భవన్'
  • పోలీసుల తీరు ఆక్షేపణీయమన్న రేవంత్
Revanth Reddy said Chalo Rajbhavan successful

పెగాసస్ వ్యవహారంపై విచారణకు డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు ఇవాళ 'ఛలో రాజ్ భవన్' చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. 'ఛలో రాజ్ భవన్' ముట్టడి కార్యక్రమం విజయవంతం అయిందని ప్రకటించారు. అయితే, తమ 'ఛలో రాజ్ భవన్' కార్యాచరణను కేసీఆర్ ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణుల నిరసనల సందర్భంగా పోలీసుల తీరు ఆక్షేపణీయం అని విమర్శించారు.

వ్యక్తిగత గోప్యతకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్న విషయం పెగాసస్ వ్యవహారంతో స్పష్టమైందని రేవంత్ రెడ్డి అన్నారు. పెగాసస్ పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించాలని, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఆరితేరారని వ్యాఖ్యానించారు.