విషనాగుకు ఎదురొడ్డి నిలిచిన పెంపుడు పిల్లి... వీడియో ఇదిగో!

22-07-2021 Thu 20:15
  • ఒడిశాలోని భీమసాంగిలో ఘటన
  • ఇంటి పెరట్లోకి ప్రవేశించిన నాగుపాము 
  • పామును అడ్డుకున్న పెంపుడు పిల్లి చిన్ను
  • పడగవిప్పి బుసలు కొట్టిన పాము
  • ఏమాత్రం భయపడని పిల్లి
Pet cat stops raging cobra

ఒడిశాలోని భీమసాంగి ప్రాంతంలో ఆసక్తికర ఘటన జరిగింది. సంపత్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లోకి ఓ నాగుపాము ప్రవేశించింది. పెరట్లోకి వస్తున్న ఆ విషసర్పాన్ని సంపత్ కుమార్ పెంపుడు పిల్లి చిన్ను గుర్తించింది. వెంటనే ఆ పామును అడ్డుకుంది. పిల్లిపై దాడి చేసేందుకు ఆ నాగు పడగ విప్పి ఉగ్రరూపం దాల్చింది. అయినప్పటికీ వెనుకంజ వేయని ఆ పిల్లి అలాగే ఎదురొడ్డి నిలిచింది.

ఇంతలో అక్కడే ఉన్న ఓ కుక్క అరవడంతో సంపత్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు వచ్చి చూడగా, బుసలు కొడుతూ తాచుపాము దర్శనమిచ్చింది. దాని ఎదురుగా వారు ఎంతో ప్రేమగా పెంచుకునే పిల్లి కనిపించింది. ఈ నేపథ్యంలో సంపత్ కుమార్ స్నేక్ వలంటీర్ కు సమాచారం అందించాడు. కాగా, ఆ స్నేక్ వలంటీర్ వచ్చేంతరకు నాగుపామును ఎటూ కదలనివ్వకుండా పిల్లి అక్కడే కూర్చుంది. ఇంతలో స్నేక్ వలంటీర్ వచ్చి చాకచక్యంగా పామును పట్టుకుని, నగరం వెలుపల అటవీప్రాంతంలో వదిలేశాడు.

ఈ ఘటన తర్వాత ఆ పెంపుడు పిల్లి చిన్ను స్థానికంగా ఓ హీరో అయింది. కాగా, పాము ఎదురుగా నిల్చిన సందర్భంగా దాన్నేమైనా కరిచిందేమోనని పరీక్షలు చేయించారు. ఎలాంటి కాటు పడలేదని తెలిసి హర్షం వ్యక్తం చేశారు.