16 ఏళ్లు పూర్తి చేసుకున్న 'సూపర్' .. అందరికీ థ్యాంక్స్ చెప్పిన అనుష్క!

22-07-2021 Thu 18:30
  • 'సూపర్' సినిమాతో పరిచయం
  • నాయికగా 16 ఏళ్ల ప్రయాణం
  • తెలుగు .. తమిళ భాషల్లో క్రేజ్
  • ఇప్పటికీ తగ్గని ఆదరణ
Anushka completed her 16 years in film industry

అందమైన అభినయానికి మరో పేరే అనుష్క. నాగార్జున హీరోగా చేసిన 'సూపర్' సినిమా ద్వారా తెలుగు తెరకి ఆమె పరిచయమైంది. నాగార్జున చాలామంది కథానాయికలను తన సినిమాల ద్వారా పరిచయం చేశారు. అలా పరిచయమైన కథానాయికల్లో అగ్రస్థానానికి చేరిన నాయికగా అనుష్క నిలిచింది. అన్నపూర్ణ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.

ఈ నెల 20వ తేదీతో ఈ సినిమా 16 ఏళ్లను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా అనుష్క స్పందించింది. ఈ సినిమాతో తనకి అవకాశం ఇచ్చిన నాగార్జున .. పూరి జగన్నాథ్ కి ఆమె థ్యాంక్స్ చెప్పింది. అలాగే తనతో కలిసి పనిచేసిన సోనూసూద్ తో పాటు అందరికీ కూడా ఆమె థ్యాంక్స్ చెప్పింది. ఇక ఈ 16 ఏళ్లలో తనని సపోర్ట్ చేస్తూ, ఇంతగా ఆదరిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది.

ఈ 16 ఏళ్ల కెరియర్లో అనుష్క ఎన్నో విజయాలను సాధించింది. ఆమె అందానికీ .. అభినయానికి అభిమానులు కానివారు లేరు. తెలుగు .. తమిళ భాషల్లోని స్టార్ హీరోలందరి సరసన అలరించింది. నాయిక ప్రధానమైన చిత్రాలలో తనకు తిరుగులేదనిపించింది. 'అరుంధతి' .. 'రుద్రమదేవి' .. 'భాగమతి' వంటి సినిమాలు ఆమె కెరియర్లో మైలురాళ్లుగా నిలిచాయి. కొంతకాలంగా సినిమాల సంఖ్యని తగ్గించినప్పటికీ, ఆమెకి గల ఆదరణ ఎంతమాత్రం తగ్గలేదు.