రాష్ట్రంలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం... అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఏపీ మంత్రి బొత్స

22-07-2021 Thu 18:10
  • ఏపీలో భారీ వర్షాలు
  • బొత్స వీడియో కాన్ఫరెన్స్
  • మున్సిపల్ కమిషనర్లకు దిశానిర్దేశం
  • క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశం
AP Minister Botsa reviews rains in state

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. తమ పరిధిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, వర్షాల దృష్ట్యా అన్ని చోట్ల కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, జాగ్రత్త చర్యల్లో వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులను భాగస్వాములను చేయాలని అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని బొత్స స్పష్టం చేశారు.