'ఫ్యామిలీ డ్రామా' నుంచి ట్రైలర్ రిలీజ్!

22-07-2021 Thu 17:21
  • సుహాస్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ 
  • దర్శకుడిగా మెహర్ తేజ్
  • దాదాపు నూతన నటీనటులే
  • త్వరలోనే విడుదల
Family Drama movie teaser released

నటుడిగా సుహాస్ ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. చిన్నచిన్న పాత్రలలో తెరపై అడపా దడపా కనిపిస్తూ వచ్చిన ఆయన, ఒక్కసారిగా 'కలర్ ఫొటో' సినిమాలో హీరోగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తరువాత కూడా ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన కథానాయకుడిగా మరో సినిమా రూపొందుతోంది. టైటిల్ 'ఫ్యామిలీ డ్రామా' అయినప్పటికీ, క్రైమ్ నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుందనే విషయం, మొన్న ఫస్టు పోస్టర్ తోనే అర్థమైపోయింది.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. కథానాయకుడు బ్లేడ్ తో చాలా సింపుల్ గా పీకలు కోసే సీరియల్ కిల్లర్ గా కనిపిస్తున్నాడు. అలా వరుస హత్యలు చేసే ఆయన బారిన ఒక ఫ్యామిలీ ఎలా పడింది? ఆలస్యంగా అసలు విషయాన్ని తెలుసుకున్న వాళ్లు ఆయన బారి నుంచి తప్పుంచుకోగలిగారా? అసలు కథానాయకుడు అలా ఎందుకు మారాడు? అనేదే అసలు కథ. ట్రైలర్ చూస్తుంటేనే ఇది ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే చూసే సినిమాగా అనిపిస్తోంది.

ఈ సినిమాతో మెహర్ తేజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఛష్మా ఫిలిమ్స్ .. నూతన భారతి ఫిలిమ్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ముఖ్యమైన పాత్రలలో పూజా కిరణ్ .. శ్రుతి మెహర్ .. సంజయ్ .. తేజ కనిపించనున్నారు. దాదాపు ఆర్టిస్టులంతా కొత్తవారే. అజయ్ - సంజయ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. డిఫరెంట్ లుక్ తో సుహాస్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్, ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.