జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులపై ఏపీ ప్రభుత్వ స్పందన ఏంటి?: రఘురామకృష్ణరాజు

22-07-2021 Thu 16:57
  • రఘురామ మీడియా సమావేశం
  • ఏపీ సర్కారుపై మాటల యుద్ధం
  • ఎస్సీ కమిషన్ నోటీసుల అంశం ప్రస్తావన
  • తాను గతంలోనూ దీని గురించి మాట్లాడానన్న రఘురామ
Raghurama Krishnaraju asks AP Govt about SC Commission notices

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ ప్రభుత్వంపై మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ నోటీసులు ఇచ్చిందని వెల్లడించారు. మతమార్పిళ్లు జరుగుతున్నాయని  నాగరాజు అనే వ్యక్తి, ఎస్సీ, ఎస్టీ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ప్రతినిధులు పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఆ పిటిషన్ ను స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ నోటీసులు జారీ చేసిందని తెలిపారు. ఆ నోటీసులపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన ఏంటి? అని ఇవాళ ఓ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. తాను గతంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించానని రఘురామ స్పష్టం చేశారు.

ఒకసారి ఎవరైనా మతం మారితే వారు బీసీ-సీ కేటగిరీలోకి వస్తారని రాజ్యాంగం చెబుతోందని వెల్లడించారు. అయితే మతం మారిన వారు కూడా ఎస్సీ రిజర్వేషన్లు పొందుతున్న అంశాన్ని నాగరాజు తదితరులు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనివల్ల దళిత హిందువులకు అన్యాయం జరుగుతోందని వారు కమిషన్ కు నివేదించినట్టు వివరించారు.

తాను రిజర్వేషన్లకు సంబంధించిన ఈ వ్యవహారాన్ని ఎత్తిచూపడం వైసీపీ పెద్దలకు నచ్చినట్టు లేదని, అందుకే తనపై లోక్ సభ స్పీకర్ కు అందజేసిన అనర్హత పిటిషన్ లో పేజీలకు పేజీలు ఈ అంశాన్నే ప్రస్తావించారని రఘురామ ఆరోపించారు.