రాజమౌళి కోసం రంగంలోకి దిగుతున్న ప్రభాస్, రానా!

22-07-2021 Thu 16:40
  • చివరి దశకు చేరిన 'ఆర్ఆర్ఆర్' నిర్మాణం 
  • భారీ ఎత్తున ప్రమోషనల్ సాంగ్ షూట్ 
  • ఆరున్నర కోట్లతో ప్రత్యేకమైన సెట్స్
  • పాటలో మెరవనున్న ప్రభాస్, రానా
Prabhas and Rana to be seen in promotional song of RRR

ప్రస్తుతం టాలీవుడ్ 'కాస్ట్ లీ' సినిమా అయిన 'ఆర్ఆర్ఆర్' నిర్మాణం పరంగా చివరిదశకు చేరుకుంది. గత కొన్ని రోజులుగా హైదరాబాదులో చివరి షెడ్యూలు షూటింగ్ జరుగుతోంది. ఇందుకోసం బాలీవుడ్ భామ అలియా భట్ కూడా ముంబై నుంచి వచ్చి షూటింగులో జాయిన్ అయింది. దీంతో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. ఇక చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి మరోపక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రమోషనల్ సాంగును కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ బాణీలు కడుతున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ పాట చిత్రీకరణ కోసం ఆరున్నర కోట్ల వ్యయంతో భారీ సెట్స్ వేశారట.

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, ప్రభాస్, రానా కూడా ఈ పాటలో మెరవనున్నట్టు తెలుస్తోంది. చిత్రంలోని ప్రధాన తారాగణమైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్ తదితరులతో పాటు ప్రత్యేక గెస్టులుగా ప్రభాస్, రానాలు ఈ పాటలో కనిపిస్తారని తాజా సమాచారం. రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' సినిమాలో వీరిద్దరూ నటించిన సంగతి విదితమే. అందుకే, వారిద్దరినీ ఈ ప్రమోషనల్ సాంగులో ఇంక్లూడ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి ఈ పాట రాజమౌళి లెవెల్లో .. లావిష్ గా రానుందన్న మాట!