Drugs: హైదరాబాద్ మీదుగా డ్రగ్స్ అక్రమ రవాణా వెనుక తాలిబాన్ల హస్తం

  • భారత్ లో తరచుగా పట్టుబడుతున్న హెరాయిన్
  • ఒక్క హైదరాబాదులోనే మూడు ఘటనలు
  • డీఆర్ఐ దర్యాప్తు
  • అక్రమ రవాణా మూలాలు ఆఫ్ఘన్ లో ఉన్నట్టు గుర్తింపు
Taliban hand in drug trafficking via Hyderabad

ఇటీవల భారత్ లోని పలు విమానాశ్రయాల్లో హెరాయిన్ తదితర డ్రగ్స్ భారీ ఎత్తున పట్టుబడుతున్న ఘటనలు అధికం అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొన్నిరోజుల వ్యవధిలోనే మూడుసార్లు పెద్దమొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

ఆఫ్ఘనిస్థాన్ నుంచి వస్తున్న ఈ మాదకద్రవ్యాలను భారత్ లోని పలు నగరాల మీదుగా పాశ్చాత్య దేశాలకు తరలిస్తున్నారని డీఆర్ఐ తెలిపింది. పట్టుబడిన హెరాయిన్ ఎంతో నాణ్యమైనదని, తద్వారా ఇది తాలిబాన్ల నియంత్రణలోని ఆప్ఘనిస్థాన్ నుంచి వస్తున్నదని గుర్తించామని వివరించింది. తొలుత మొజాంబిక్, దోహా వంటి ప్రాంతాలకు అక్రమ రవాణా చేసి, అక్కడ్నించి భారత్ లోని పలు నగరాలకు తీసుకువస్తున్నారని, భారత్ నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, కొన్ని పాశ్చాత్య దేశాలకు పంపిస్తున్నారని డీఆర్ఐ తన నివేదికలో పేర్కొంది.

తాలిబాన్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల నుంచి వస్తున్న ఈ హెరాయిన్ ను ఆఫ్రికాకు చెందిన కొన్ని డ్రగ్స్ మాఫియా గ్యాంగులు కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఎయిర్ పోర్టుల వద్ద లభ్యమవుతున్న దానికంటే సముద్ర తీర ప్రాంతాల్లోని ఓడరేవుల ద్వారా జరిగే అక్రమ రవాణా ఎంతో అధికంగా ఉంటుందని డీఆర్ఐకి చెందిన ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.

More Telugu News