బాలకృష్ణను 'మా' అధ్యక్షుడిగా ఎన్నుకుంటే చాలా సంతోషిస్తా: మంచు విష్ణు

22-07-2021 Thu 15:27
  • ఇండస్ట్రీ పెద్దలు ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పోటీ నుంచి తప్పుకుంటా
  • నాగబాబు నాకు తండ్రిలాంటి వ్యక్తి
  • రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి
I will be very happy if Balakrishna elected as MAA president says Manchu Vishnu

'మా' ఎన్నికలు తెలుగు సినీ పరిశ్రమలో వేడి పుట్టిస్తున్నాయి. అధ్యక్ష పదవి కోసం పోటీ చేయబోతున్నట్టు ఇప్పటి వరకు ఐదుగురు ప్రకటించారు. వీరిలో హీరో మంచు విష్ణు కూడా ఒకరు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... నందమూరి బాలకృష్ణ 'మా' అధ్యక్షుడైతే తాను ఎంతో సంతోషిస్తానని చెప్పారు. ఇండస్ట్రీ పెద్దలంతా ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పోటీ నుంచి తాను తప్పుకుంటానని... లేకపోతే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఏకగ్రీవంగా ఎవరిని ఎన్నుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పారు.
 
బాలయ్యతో పాటు ఆయన జనరేషన్ కి చెందిన కొందరు నటీనటులు 'మా' ఎన్నికల్లో నిలబడలేదని, వారిలో ఎవరు అధ్యక్షుడు అయినా తనకు అభ్యంతరం లేదని, తనకు సోదరుడి లాంటి వ్యక్తి అయిన బాలయ్య అధ్యక్షుడు అయితే తనకు ఇంకా సంతోషమని మంచు విష్ణు అన్నారు. నాగబాబు తనకు తండ్రిలాంటి వ్యక్తి అని, ఆయనంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.

'మా' శాశ్వత భవన నిర్మాణంపై తన ప్లాన్ ఏమిటో చెప్పాలని నాగబాబు వేసిన ప్రశ్నకు బదులుగా... రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. వారితో మాట్లాడి 'మా'కు కావాల్సిన భూమిని సంపాదించగలననే నమ్మకం ఉందని చెప్పారు.