Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ లో మరో 5 క్రీడాంశాలకు చోటు

  • కరాటే, స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్ లకు స్థానం
  • క్లైంబింగ్, బేస్ బాల్ అంశాలకూ చోటు
  • రేపటి నుంచి ఒలింపిక్స్
  • జపాన్ రాజధాని టోక్యో వేదికగా విశ్వక్రీడలు
Five more sporting events in Tokyo Olympics

రేపటి నుంచి జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. కరోనా సంక్షోభం నడుమ జరుగుతున్న ఈ విశ్వ క్రీడ సంరంభానికి ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. టోక్యో ఒలింపిక్స్ లో మరో 5 క్రీడాంశాలకు స్థానం కల్పించారు. ఈసారి కరాటే, స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్, బేస్ బాల్/సాఫ్ట్ బాల్ ఈవెంట్లు కూడా క్రీడాభిమానులను అలరించనున్నాయి.

బాక్సింగ్, జూడో, తైక్వాండో వంటి పోరాట విద్యలు ఎప్పటి నుంచో ఒలింపిక్స్ లో ఉండగా, వాటి కోవకు చెందిన కరాటేకు ఇన్నాళ్లకు స్థానం కల్పించారు. కరాటేలోని కుమిటే విభాగంలో 60 మంది, కటా విభాగంలో 20 మంది టోక్యో ఒలింపిక్స్ లో పతకాల కోసం పోటీ పడనున్నారు.

స్కేట్ బోర్డింగ్ విషయానికొస్తే... కాళ్లకు బోర్డులు తగిలించుకుని స్కేటింగ్ చేయడం యూరప్ దేశాల్లో విరివిగా కనిపిస్తుంది. పలు దేశాల్లో దీనికి సంబంధించి చాంపియన్ షిప్ లు కూడా నిర్వహిస్తుంటారు. తాజాగా ఈ క్రీడాంశం ఒలింపిక్స్ లో అరంగేట్రం చేస్తోంది. 80 మంది పురుష, మహిళా క్రీడాకారులు ఈ అంశంలో పోటీ పడుతున్నారు. వీరందరిలోకి పిన్న వయస్కురాలైన అథ్లెట్ పేరు స్కై బ్రౌన్. బ్రిటన్ కు చెందిన బ్రౌన్ వయసు కేవలం 13 సంవత్సరాలే. పిట్టకొంచెం కూత ఘనం రీతిలో స్కేట్ బోర్డింగ్ లో సత్తా చాటుతోంది.

ఇక, స్పోర్ట్ క్లైంబింగ్ యూరప్ దేశాల్లో ఓ క్రీడగా ప్రాచుర్యం పొందుతోంది. ఓ రేసు తరహాలోనే ఎవరు వేగంగా క్లైంబింగ్ పూర్తిచేస్తారన్నదాన్ని పరిగణనలోకి తీసుకుని విజేతలను నిర్ణయిస్తారు. ఇందులోనే లీడ్ క్లైంబింగ్ విభాగంలో... 6 నిమిషాల్లో ఎవరు అత్యధిక ఎత్తును అధిరోహిస్తారన్నదాని ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. టోక్యో ఒలింపిక్స్ ద్వారా పరిచయం అవుతున్న ఈ క్రీడాంశంలో స్లొవేనియా, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, ఇటలీ దేశాలకు చెందిన వాళ్లు అత్యధికంగా పాల్గొంటున్నారు.

సముద్ర సాహసక్రీడగా పేరుగాంచిన సర్ఫింగ్ టోక్యో ఒలింపిక్స్ లో అందరినీ అలరిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇది సాగర క్రీడ కావడంతో టోక్యో ఒలింపిక్స్ స్టేడియానికి 100 కిలోమీటర్ల దూరంలోని సురిగసాకి బీచ్ లో ఈ సర్ఫింగ్ పోటీలు నిర్వహించనున్నారు. టోక్యో ఒలింపిక్స్ లో సర్ఫింగ్ క్రీడాంశంలో 5 విభాగాల్లో మొత్తం 40 మంది సర్ఫర్లు పాల్గొంటున్నారు. ఈ క్రీడాంశంలో బ్రెజిల్, అమెరికా, ఆస్ట్రేలియా సర్ఫర్లు పతకాలు కొల్లగొట్టే అవకాశాలున్నాయని అంచనా.

కాగా, బేస్ బాల్/సాఫ్ట్ బాల్ మరోసారి ఒలింపిక్స్ లోకి అడుగుపెడుతోంది. 1992, 1996 ఒలింపిక్స్ లో బేస్ బాల్ క్రీడాంశంలోనూ పోటీలు నిర్వహించగా ఓ మోస్తరు స్పందన వచ్చింది. అయితే 2008 బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత బేస్ బాల్ క్రీడను ఒలింపిక్ చార్టు నుంచి తొలగించారు. అయితే జపాన్ లో బేస్ బాల్ కు విపరీతమైన ప్రజాదరణ ఉండడంతో, ఈసారి దానికి కూడా స్థానం కల్పించారు.

More Telugu News