10 రంగుల్లో ఓలా ఎలక్ట్రిక్​ బైక్​.. వెల్లడించిన సంస్థ

22-07-2021 Thu 15:08
  • నీలం, ఎరుపు, నలుపు, తెలుపు, గులాబీ, ఊదా వంటి రంగుల్లో లభ్యం
  • లాంచింగ్ సమయంలోనే కచ్చితమైన రంగుల వెల్లడి
  • ఒక్కరోజులోనే లక్ష ముందస్తు బుకింగ్ లు
Ola Electric Announces Colors Of Its Bikes

ఓలా ఎలక్ట్రిక్ బైకులపై ప్రస్తుతం ఎంతో ఆసక్తి నెలకొంది. దాని కోసం ఎందరు ఎదురు చూస్తున్నారో.. ఒక్కరోజులోనే జరిగిన ముందస్తు బుకింగ్ లే చెబుతాయి. జులై 14న బుకింగ్స్ మొదలైతే.. ఒక్కరోజులోనే లక్ష మందికిపైగా బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ బైకు అందరి దృష్టిలో పడింది.

అప్పటికి కొన్ని ఫీచర్లను మాత్రమే వెల్లడించిన సంస్థ.. రంగు, ధర, మార్కెట్ లోకి ఎప్పుడు వచ్చేది మాత్రం ప్రకటించలేదు. తాజాగా ఏయే రంగుల్లో ఎలక్ట్రిక్ బైక్ లభ్యమవుతుందో ఓలా ఎలక్ట్రిక్ సీఈవో, చైర్మన్ భవీశ్ అగర్వాల్ వెల్లడించారు. మొత్తం 10 రంగుల్లో బైకును అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.


కచ్చితమైన రంగులకు సంబంధించిన పూర్తి వివరాలను బైకు లాంచింగ్ సందర్భంగా వెల్లడిస్తామని ఆయన చెప్పారు. నీలం, నలుపు, ఎరుపు, గులాబీ, పసుపు, వెండి, ఊదా, తెలుపు వంటి ఎనిమిది రంగులను వెల్లడించారు. రంగుల విప్లవమని పేర్కొన్న భవీశ్.. ‘మీరు ఏ రంగు కావాలనుకుంటున్నారు?’ అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు.  

కాగా, ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చని సంస్థ చెబుతోంది. అంతేగాకుండా రెండు హెల్మెట్లు పట్టేంత డిక్కీ స్పేస్ ను ఇస్తున్నట్టు వెల్లడించింది. బ్యాటరీని బయటకు తీసి చార్జింగ్ పెట్టుకునే వెసులుబాటునూ కల్పించింది. బైకు పేరును అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ‘ఎస్’, ‘ఎస్1’, ‘ఎస్1ప్రో’ పేరిట సంస్థ రిజిస్టర్ చేయించింది. దీంతో బైక్ పేర్లు అవే అయి ఉంటాయని తెలుస్తోంది. ఇంకా దీని ధరను నిర్ణయించకపోయినప్పటికీ, జనానికి ధర అందుబాటులోనే ఉంటుందని సంస్థ వెబ్ సైట్ పేర్కొంది.