ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ 'వైయస్సార్ కాపు నేస్తం' పథకాన్ని అమలు చేస్తున్నాం: జగన్

22-07-2021 Thu 12:29
  • వైయస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా పేద మహిళలకు ఏటా రూ. 15 వేలు ఇస్తున్నాం
  • అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సాయాన్ని అందిస్తాం
  • మేనిఫెస్టోలో లేకపోయినా పథకాన్ని అమలు చేస్తున్నాం
AP govt releases funds for Kapu Nestam

ఏపీ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది  వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేసింది. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బును నేరుగా జమ చేశారు. ఈ పథకం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 3,27,244 మంది పేద మహిళలకు రూ. 490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. అయితే బ్యాంకులు పాత అప్పుల కింద ఈ డబ్బును జమ చేసుకోకుండా అన్ ఇన్కమ్బర్డ్ ఖాతాల్లో నగదును జమ చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, నిరుపేదలైన కాపుల కోసం వైయస్సార్ కాపు నేస్తాన్ని అందిస్తున్నామని చెప్పారు. అర్హులైన కాపు మహిళలకు ప్రతి ఏటా రూ. 15 వేల చొప్పున... ఐదేళ్లలో రూ. 75 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సాయాన్ని అందిస్తామని, అర్హత లేని ఏ ఒక్కరికీ ఈ పథకాన్ని వర్తింపజేయబోమని చెప్పారు. రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ... వెనకడుగు వేయకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని జగన్ తెలిపారు. గత ప్రభుత్వం ఏం చేసిందో అందరూ గుర్తుకు తెచ్చుకోవాలని... ప్రతి ఏటా రూ. రూ. 1,500 కోట్లు ఇస్తామని చెప్పి ఏడాదికి కనీసం రూ. 400 కోట్లు కూడా ఇవ్వలేదని అన్నారు.