భారతరత్న పురస్కారంపై బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు

22-07-2021 Thu 12:01
  • తన తండ్రికి ఏ అవార్డూ సాటి రాదన్న బాలకృష్ణ
  • ఏఆర్ రెహ్మాన్ ఎవరో తెలియదని కామెంట్
  • మండిపడుతున్న నెటిజన్లు
Hero Nandamuri Balakrishna Controversial Comments On Bharata Ratna and AR Rehman

కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ పై ఇటీవల ఓ చానెల్ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశారు. భారతరత్న తన తండ్రి ఎన్టీఆర్ కాలి గోటికి సమానమన్నారు. సినిమా పరిశ్రమకు తన తండ్రి చేసిన అసమాన సేవలకు ఏ అవార్డూ సాటిరాదన్నారు. అవార్డులు పొందడం ఆయనకు గౌరవం కాదని.. ఆయనకు ఇచ్చిన వారికే గౌరవమని అన్నారు. పదవులు ఆయనకు అలంకారమేమోగానీ.. ఆయనెప్పుడూ పదవులకు అలంకారం కాదన్నారు.

సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ ఎవరో తనకు తెలియదన్నారు. తాను ఎవరి గురించి పట్టించుకోనన్నారు. రెహ్మాన్ ఆస్కార్ గెలిచి ఉండొచ్చు కానీ.. తనకు మాత్రం ఆయన గురించి తెలియదని చెప్పారు. పదేళ్లకోసారి హిట్లు ఇస్తాడంటూ కామెంట్ చేశారు. ఇక, తనను తాను హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ తోనూ బాలయ్య పోల్చుకున్నారు. కేమరూన్ కన్నా తానే సినిమాలు వేగంగా పూర్తి చేస్తానన్నారు.

ఇక బాలయ్య వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తన నిప్పురవ్వ సినిమా కోసం రెహ్మాన్ పనిచేసిన విషయాన్ని బాలయ్య మరిచిపోయినట్టున్నారని విమర్శిస్తున్నారు. రెహ్మాన్ పనిచేసిన తొలి తెలుగు హీరో బాలయ్యేనని గుర్తు చేస్తున్నారు.