డేరింగ్ జర్నలిస్ట్ పాత్రలో తాప్సీ!

22-07-2021 Thu 11:45
  • బాలీవుడ్ లో బిజీ అయిన తాప్సీ 
  • 'మిషన్ ఇంపాజిబుల్'తో రీ ఎంట్రీ
  • తిరుపతి నేపథ్యంలో సాగే కథ 
  • దర్శకుడిగా స్వరూప్  
Tapsi is doing Journlist role in Mishan Impossible movie

తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికల జాబితాలో తాప్సీ ఒకరు. చక్కని మేని ఛాయ .. ఆకర్షణీయమైన రూపంతో ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. యువ కథానాయికల జోడీగా కొన్ని సినిమాలు చేసింది. అయితే ఆమె చేసిన సినిమాల్లో భారీ విజయాలను సాధించిన సినిమాలు చాలా తక్కువ. వరుస పరాజయాల కారణంగా ఆమెకి ఇక్కడ అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఆమె తన మకాంను చెన్నైకి మార్చింది. అక్కడ కూడా ఆమెకి ఆశాజనకంగా అనిపించలేదు.

దాంతో తాప్సీ నేరుగా ముంబైకి వెళ్లింది .. అక్కడ చాలా గట్టిగానే ప్రయత్నాలు చేసింది. తెలుగులో కేవలం గ్లామర్ పాత్రలు చేయడం వల్లనే, తాను త్వరగా బయటికి రావలసి వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని, నటనకి స్కోప్ ఉండే పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వెళ్లింది. ఆమె తీసుకున్న ఆ నిర్ణయమే ఆమె కెరియర్ కి ప్లస్ అయింది. ఇప్పుడు తాప్సీ ఖాతాలో మంచి మంచి బాలీవుడ్ సినిమాలు కనిపిస్తాయి. ఫలానా తరహా పాత్రలు తాప్సీ బాగా చేయగలదనే పేరును ఇండస్ట్రీలోనూ .. అభిమానుల్లోను సంపాదించుకుంది.

అలాంటి తాప్సీకి ఈ మధ్య తెలుగు నుంచి కూడా అవకాశాలు వెళుతున్నాయి. తాజాగా ఆమె నాయిక ప్రధానమైన సినిమాను అంగీకరించింది .. ఆ సినిమా పేరే 'మిషన్ ఇంపాజిబుల్'. ఈ సినిమాలో తాప్సీ డేరింగ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. తిరుపతి నేపథ్యంలో జరిగే కిరాయిహత్యల చుట్టూ ఈ కథ తిరుగుతుందనీ, వాటికి కారకులైనవారిని పట్టించే జర్నలిస్ట్ గా తాప్సీ కనిపిస్తుందని చెబుతున్నారు. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి స్వరూప్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.