ఒకే ఒక్క పాత్రతో సినిమా .. ఆ పాత్రలో హన్సిక!

22-07-2021 Thu 10:59
  • హన్సిక నుంచి ‘105 మినిట్స్‌’ 
  • విభిన్నమైన కథ
  • ప్రయోగాత్మక పాత్ర
  • సామ్ సీఎస్ సంగీతం
Hansika new movie update

తెలుగు తెరపై గ్లామర్ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసిన కథానాయికల జాబితాలో హన్సిక పేరు కచ్చితంగా కనిపిస్తుంది. తెలుగులో ఆమె చేసిన సినిమాలలో 'దేశముదురు' .. 'కందిరీగ' భారీ విజయాలను అందుకున్నాయి. 'దేనికైనా రెడీ' సినిమా కూడా బాగానే ఆడింది. తెలుగు తెరపై చివరిసారిగా ఆమె కనిపించిన చిత్రం మాత్రం 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'. సందీప్ కిషన్ జోడీగా ఆమె చేసిన ఈ సినిమా కూడా ఫరవాలేదనిపించుకుంది.

ఆ తరువాత హన్సిక చేస్తున్న సినిమాగా ‘105 మినిట్స్‌’ రూపొందుతోంది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగు మొదలైంది. బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజు దుస్స దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో ఉండడు .. అలా అని చెప్పేసి నాయికను ప్రధానంగా చేసుకుని ఇతర పాత్రల చుట్టూ అల్లిన కథ కాదు. అసలు ఈ కథలో నాయిక తప్ప తెరపై ఎవరూ కనిపించరు. అదే ఈ సినిమా ప్రత్యేకత .. అందుకే ఇది ప్రయోగాత్మక చిత్రాల కేటగిరీలోకి వెళుతుంది.

సింగిల్ షాట్ ఫార్మేట్ లో సినిమా చిత్రీకరణ ఉంటుందట. ఈ సినిమాకి ప్రత్యేకించి ఎడిటింగ్ కూడా ఉండదని అంటున్నారు. అంటే షూటింగు స్పాట్ లోనే ఎడిటర్ ఉంటూ పర్యవేక్షిస్తూ ఉంటాడు .. అంతేగాని ఆ తరువాత ఎడిటింగ్ చేయడం ఉండదు. ఈ తరహా కాన్సెప్ట్ తో .. చిత్రీకరణతో ఇంతవరకూ ఇండియన్ స్క్రీన్ పై ఏ సినిమా రాలేదని చెబుతున్నారు. ఈ తరహా సినిమాలో చేయడం తనకి చాలా థ్రిల్లింగ్ గా ఉందని హన్సిక అంటోంది. ఈ సినిమా ఆమె కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందేమో చూడాలి మరి.