Siva Sree: శివశ్రీ ఇల్లు కూల్చివేత.. ఆత్మహత్యకు యత్నించిన సోదరుడు!

  • భద్రతా కారణాల రీత్యా జగన్ నివాసం వెనకున్న ఇళ్ల కూల్చివేత
  • ఇంటిని కూల్చివేయడంతో స్పృహ కోల్పోయిన శివశ్రీ తల్లి
  • తనకు ప్రాణహాని ఉందంటూ వీడియో విడుదల
  • ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని ఆవేదన
Siva Sree house demolished

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వెనక పేదల ఇళ్ల కూల్చివేతలపై పోరాడుతున్న శివశ్రీ ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఇంటిని కూల్చివేస్తున్నామని, గురువారం లోగా ఖాళీ చేసి వెళ్లాలని మంగళవారం నోటీసులు అంటించిన అధికారులు గతరాత్రి కూల్చివేయడం గమనార్హం. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలవడం వల్లే తన ఇంటిని కూల్చివేశారని, అధికారులు తనపై కక్ష సాధిస్తున్నారని శివశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ శివశ్రీ వీడియో విడుదల చేశారు.

భద్రతా కారణాల రీత్యా ముఖ్యమంత్రి నివాసం వెనక ఉన్న అమరారెడ్డినగర్ కాలనీలోని 321 కుటుంబాలను ప్రభుత్వం ఖాళీ చేయిస్తోంది. ఇందులో భాగంగా 277 కుటుంబాలకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి ఇళ్లు మంజూరు చేసింది. వీరిలో 124 మంది స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేయడంతో అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే, స్థలాల కేటాయింపులో న్యాయం జరగలేదని, నిరాశ్రయులకు మరింత పరిహారం ఇవ్వాలంటూ శివశ్రీ పోరాడుతున్నారు. కాగా, శివశ్రీ ఇంటిని అధికారులు కూల్చివేయడంతో ఆమె తల్లి స్పృహతప్పి పడిపోయారు. మనస్తాపానికి గురైన ఆమె సోదరుడు ఆత్మహత్యకు యత్నించాడు.

More Telugu News