చంద్రబాబు, మైసూరారెడ్డిలపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు

21-07-2021 Wed 19:30
  • వ్యవసాయం దండగ అన్న ఘనత చంద్రబాబుది
  • తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు
  • నీటిని తెలంగాణ తోడేస్తుంటే చంద్రబాబు, మైసూరారెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు?
Why Chandrababu and Mysoora Reddy are not talking about Telangana water theft asks Gadikota Srikanth Reddy

చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరకు ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదని అన్నారు. వ్యవసాయం దండగ అని చెప్పిన ఘనత చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. రాయలసీమ నీటి కష్టాలను తీర్చేందుకు సీఎం జగన్ యత్నిస్తున్నారని... కానీ, చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తన వైఖరి ఏమిటో చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు నీటిని తోడేస్తుంటే చంద్రబాబు, మైసూరారెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాదులో నివాసం ఉంటున్నారు కాబట్టి భయపడ్డారా? అని ఎద్దేవా చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటి కేటాయింపులు జరిగినప్పటికీ... విద్యుత్ ఉత్పత్తి పేరుతో నదీ జలాలను తెలంగాణ అక్రమంగా వినియోగిస్తోందని విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. నీటి కేటాయింపులను కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబుకు అవసరం లేదని దుయ్యబట్టారు.