Mangli: ఆ పాటలో ఎలాంటి వివాదాస్పద పదాలను వాడలేదు: మంగ్లీ వివరణ

Not used controversial words in Bonalu song says Mangli
  • వివాదాస్పదంగా మారిన మంగ్లీ బోనాల పాట
  • మోతెవరి అనే పదంపై విమర్శలు
  • లిరిక్ మార్చి పాటను  విడుదల చేస్తున్నామన్న మంగ్లీ
టాలీవుడ్ గాయని మంగ్లీ రూపొందించిన బోనాల పాటపై వివాదం నెలకొంది. తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో ఈ నెల 11న మంగ్లీ బోనాల పాటను విడుదల చేసింది. ఈ పాటలో ఉపయోగించిన కొన్ని పదాలపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ పాటపై హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంగ్లీ ఇబ్బందుల్లో పడిపోయింది. బీజేపీ కార్యకర్తలు మంగ్లీపై ఏకంగా కేసు కూడా పెట్టారు.

ఈ నేపథ్యంలో మంగ్లీ స్పందిస్తూ తాను ఎలాంటి వివాదాస్పద పదాలను వాడలేదని చెప్పింది. తెలంగాణలో గ్రామ దేవతల ఒగ్గు కథలు, బైండ్లోల కొలువులు ఇలా రకరకాల ఆచారాలు ఉన్నాయని తెలిపింది. భక్తిలో కూడా వైరి భక్తి, మూఢ భక్తి అని వివిధ రకాలు ఉన్నాయని చెప్పింది. వీటన్నింటి నేపథ్యంలోనే ఈ పాటను రూపొందించామని తెలిపింది. ముఖ్యంగా ఈ పాటలో ఉపయోగించిన 'మోతెవరి' అనే పదంపై విమర్శలు వస్తుండటంతో ఈ లిరిక్స్ లో మార్పులు చేసి కొత్త పాటను రిలీజ్ చేస్తున్నామని మంగ్లీ చెప్పింది.

80 ఏళ్ల వయసున్న రచయిత రామస్వామి గారు 25 ఏళ్ల క్రితం ఈ పాటను రచించారని మంగ్లీ తెలిపింది. మోతెవరి అంటే గ్రామ పెద్ద అని అర్థమని... ఈ అర్థంతోనే పాట సాగుతుందని చెప్పింది. అయితే కాలక్రమంలో ఆ పదం వ్యతిరేకపదంగా వాడుకలోకి వచ్చిందని... యాసను వివాదం చేయడం ద్వారా ఆయనను కించపరిచే ప్రయత్నం చేయవద్దని కోరింది.
Mangli
Tollywood
Bonalu Song
BJP

More Telugu News