మహేశ్ తో త్రివిక్రమ్ మూవీకి ముహూర్తం ఖరారైనట్టే!

21-07-2021 Wed 17:36
  • షూటింగు దశలో 'సర్కారువారి పాట'
  • కరోనా కారణంగా షూటింగులో జాప్యం
  • ఆగస్టు 9న మహేశ్ బాబు బర్త్ డే
  • ఆ రోజే త్రివిక్రమ్ మూవీ పూజా కార్యక్రమాలు  
Trivikram movie shooting update

మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమాను రూపొందించనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వచ్చేనెల 9వ తేదీన మహేశ్ బాబు పుట్టినరోజు. అందువలన ఆ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరపనున్నట్టుగా తెలుస్తోంది.

గతంలో త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో 'అతడు' .. 'ఖలేజా' సినిమాలు వచ్చాయి. అందువలన సహజంగానే ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఇదే రోజున 'సర్కారువారి పాట' నుంచి సర్ ప్రైజ్ ఉంటుందని అంటున్నారు. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' రూపొందుతోంది. బ్యాంకుకి సంబంధించిన భారీ స్కామ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన కథానాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. ఈ పాటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకోవలసింది. కానీ కరోనా కారణంగా రెండో షెడ్యూల్ దగ్గరే ఉంది. అలా అని చెప్పేసి త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ఆలస్యం కాదు. మహేశ్ బాబు ఒక వైపున 'సర్కారువారి పాట' చేస్తూనే, మరోవైపున త్రివిక్రమ్ మూవీ కూడా చేయనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.