'భీష్మ' దర్శకుడితో బాలకృష్ణ?

21-07-2021 Wed 17:10
  • 'అఖండ' పనులతో బాలయ్య
  • గోపీచంద్ మలినేనితో యాక్షన్ ఎంటర్టైనర్
  • లైన్లో అనిల్ రావిపూడి, శ్రీవాస్
  • తెరపైకి వెంకీ కుడుముల పేరు
Balakrishna in Venky Kudumula movie

యూత్ కి నచ్చే కథలను తయారు చేసుకుంటూ, వాళ్ల నుంచి మంచి మార్కులను కొట్టేస్తూ దర్శకుడు వెంకీ కుడుముల ముందుకు వెళుతున్నాడు. ఆయన నుంచి వచ్చిన 'ఛలో' .. 'భీష్మ' రెండు సినిమాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. మూడో సినిమాను సెట్ చేసుకునే ప్రయత్నంలోనే ఆయన ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన బాలకృష్ణతో ఒక సినిమా చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే ఒక కథను ఆయన బాలకృష్ణకి వినిపించి ఓకే చేయించుకున్నాడని అంటున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ 'అఖండ' సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తరువాత అనిల్ రావిపూడి .. శ్రీవాస్ లైన్లో ఉన్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో కూడా బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నాడనే టాక్ రీసెంట్ గా వినిపించింది. ఈ సినిమాకి దర్శకుడిగా వెంకీ కుడుముల పేరు బయటికి వచ్చింది. ఒకవేళ ఇది నిజమే అయినా, బాలకృష్ణ కమిట్మెంట్స్ పూర్తయిన తరువాతనే ఉంటుంది. ఈలోగా వెంకీ కుడుముల మరో హీరోతో మరో ప్రాజెక్టును పూర్తిచేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.