Brisbane: 2032 ఒలింపిక్స్ నిర్వహణను పోటీ లేకుండానే దక్కించుకున్న బ్రిస్బేన్

  • 2032 పారాలింపిక్స్ కూడా బ్రిస్బేన్ లోనే
  • మూడోసారి ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనున్న ఆస్ట్రేలియా
  • ఆస్ట్రేలియాకు ఇది చారిత్రాత్మకమైన రోజన్న ప్రధాని మోరిసన్
Brisbane picked to host 2032 Olympics

ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంగ్రామం ఒలింపిక్స్. అన్ని దేశాలు పాల్గొనే అతి పెద్ద క్రీడా వేడుక ఇది. వేలాది మంది ప్రపంచ స్థాయి క్రీడాకారులు, అథ్లెట్లు ఈ పోటీల్లో పతకాన్ని సాధించి... తమ దేశ కీర్తిని మరింత పెంచేందుకు తహతహలాడుతుంటారు. అంతేకాదు, ఈ పోటీలను నిర్వహించడాన్ని కూడా అన్ని దేశాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. ఎల్లుండి నుంచి జపాన్ లో ఒలింపిక్స్ జరగనున్నాయి. టోక్యో ఈ వేడుకకు ఆతిథ్యమిస్తోంది.

మరోవైపు 2032లో జరగబోయే ఒలింపిక్స్ కు వేదిక ఖరారయింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ఈ పోటీలను నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఆమోదముద్ర వేసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఎలాంటి పోటీ లేకుండానే ఈ బిడ్ ను ఆస్ట్రేలియా దక్కించుకుంది. 2032లో ఒలింపిక్స్ పూర్తయిన తర్వాత జరగబోయే పారాలింపిక్స్ కూడా అక్కడే జరగనున్నాయి. 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో మళ్లీ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. 1956లో మెల్ బోర్న్ లోను, 2000లో సిడ్నీలోను ఒలింపిక్స్ జరిగాయి. 2032లో ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్ కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వబోతోంది.

ఈ సందర్భంగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మాట్లాడుతూ, ఈ క్రీడలను విజయవంతం చేయడానికి ఏమేం అవసరమో ఆస్ట్రేలియాకు తెలుసని చెప్పారు. ఇది బ్రిస్బేన్ కే కాకుండా, యావత్ దేశానికే చారిత్రాత్మకమైన రోజని అన్నారు. 2024 ఒలింపిక్స్ కు ప్యారిస్, 2028లో లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టోక్యో ఒలింపిక్స్ ఈ నెల 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగబోతున్నాయి.

More Telugu News