రాజమౌళి కోసం అనిరుధ్ ప్రమోషనల్ సాంగ్?

21-07-2021 Wed 16:25
  • ప్రస్తుతం అందరి కళ్లూ 'ఆర్ఆర్ఆర్' పైనే!
  • ముగింపు దశకి చేరిన సినిమా షూటింగ్ 
  • ప్రమోషనల్ సాంగ్ కోసం ప్రత్యేక సెట్స్  
Aniruth Ravichandran to compose a promotional song for Rajamouli

ఈవేళ టాలీవుడ్ లో అందరి కళ్లూ 'ఆర్ఆర్ఆర్' సినిమాపైనే వున్నాయి. దీనికి, 'బాహుబలి' సీరీస్ తర్వాత దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న సినిమా కావడం ఒక కారణమైతే... ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ కావడం మరొక కారణం. చిత్రం షూటింగ్ ముగింపు దశకి చేరుకున్న ప్రస్తుత సమయంలో ఈ సినిమాకు సంబంధించి ఓ తాజా వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే, ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ పనిచేస్తున్నాడట!

సాధారణంగా రాజమౌళి చిత్రాలకు ఆయన సోదరుడు కీరవాణి పనిచేస్తుంటారు. అలాగే ఈ 'ఆర్ఆర్ఆర్'కి కూడా ఆయనే సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అయితే, సినిమా ప్రమోషన్ కు సంబంధించిన ఒక పాటను ఇప్పుడు స్పెషల్ గా చేయించాలని నిర్ణయించారట. దానిని యువ సంగీత దర్శకుడితో చేయిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అనిరుధ్ తో చేయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ పాటను ఎన్టీఆర్, చరణ్, అలియా భట్ లతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై భారీ సెట్స్ పై చిత్రీకరించడానికి కూడా మరోపక్క ఏర్పాట్లు చేస్తున్నారట.