పంజాబ్ లో మారుతున్న రాజకీయం.. 62 మంది ఎమ్మెల్యేలతో సిద్ధూ సమావేశం!

21-07-2021 Wed 13:58
  • ట్విట్టర్ లో వెల్లడించిన పంజాబ్ పీసీసీ చీఫ్
  • అమృత్ సర్ లోని తన నివాసంలో భేటీ
  • ప్రాధాన్యం సంతరించుకున్న వ్యాఖ్యలు
Sidhu Held Meeting With 62 MLAs at his residence

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికైన కొన్ని రోజులకే పార్టీ ఎమ్మెల్యేలతో నవ్ జోత్ సింగ్ సిద్ధూ సమావేశమయ్యారు. ఇవాళ అమృత్ సర్ లోని తన నివాసంలో 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ సమావేశాన్ని ఆయన ‘గాలి మార్పు’ అంటూ అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రజల కోసం.. ప్రజల చేత.. ప్రజల యొక్క’ అంటూ ట్వీట్ చేశారు.


పీసీసీ చీఫ్ గా సిద్ధూను నియమిస్తున్నట్టు ఆదివారం కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కు సన్నిహిత నేతలతో సిద్ధూ సమావేశమయ్యారు. వాస్తవానికి చాలా రోజులుగా కెప్టెన్ అమరీందర్ కు, సిద్ధూకు అస్సలు పడడం లేదు. సీఎం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ సిద్ధూ వ్యతిరేకిస్తూ వచ్చారు. వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకోవడం దగ్గర్నుంచి.. మొన్నటి కరెంట్ కోతల వరకు సీఎంపై సిద్ధూ విమర్శనాస్త్రాలు సంధించారు.