వెంటిలేష‌న్‌పై యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్‌.. ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యుల ప్ర‌క‌ట‌న‌

21-07-2021 Wed 13:28
  • నిన్న సాయంత్రం నుంచి లైఫ్‌ సేవింగ్ సపోర్ట్‌పై క‌ల్యాణ్ సింగ్
  • ఆరోగ్య ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తోన్న‌ సీనియర్ వైద్యుల బృందం
  • ఆరోగ్య ప‌రిస్థితి స్థిరంగా లేద‌న్న వైద్యులు
 Kalyan Singh condition critical

అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోన్న ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ (89) ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా మారింది. ప్ర‌స్తుతం ఆయ‌నను వెంటిలేషన్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఆయ‌న‌ను లైఫ్‌ సేవింగ్ సపోర్ట్‌పై ఉంచామ‌ని వైద్యులు ప్ర‌క‌టించారు. సీనియర్ వైద్యుల బృందం ఆయన ఆరోగ్య ప‌రిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపారు. అయితే, ఆయన ఆరోగ్య ప‌రిస్థితి స్థిరంగా లేద‌ని చెప్పారు.

కాగా, క‌ల్యాణ్ సింగ్ ల‌క్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ ఆసుప‌త్రిలో ఈ నెల 4వ తేదీ నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవ‌లే ఆసుప‌త్రికి వెళ్లిన ప‌లువురు నేత‌లు ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. క‌ల్యాణ్ సింగ్‌కు హృద్రోగ‌, న‌రాల వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స అందిస్తున్నారు.