ఒలింపిక్స్ కు వెళుతున్న బాక్సర్​ కోసం అసోం అధికార, ప్రతిపక్షాలు ఏకమయ్యాయ్​​!

21-07-2021 Wed 13:27
  • టోక్యో ఒలింపిక్స్ కు అసోం నుంచి ఏకైక అథ్లెట్
  • లవ్లీనాను ప్రోత్సహించేందుకు సైకిల్ ర్యాలీ
  • ఆమె తండ్రికి సన్మానం
Ruling and Opposition Parties United To Cheer Boxer

నిత్యం విమర్శలు, ప్రతివిమర్శలతో పోటాపోటీగా ఉండే అధికార, ప్రతిపక్షాలు కలిసిపోయాయి. ఏంటీ.. నమ్మబుద్ధి కావడం లేదా. ఇది నిజం. అయితే, అది రాజకీయం కోసం కాదు. ఓ మంచి పని కోసం. టోక్యో ఒలింపిక్స్ లో అసోంకు చెందిన లవ్లీనా బోర్గోహెయిన్ బాక్సింగ్ రింగ్ లో తలపడబోతోంది. రాష్ట్రం నుంచి బరిలోకి దిగనున్న ఒకే ఒక్క అథ్లెట్ కావడంతో ఆమెను ప్రోత్సహించడం కోసం.. ఇలా వారంతా ఏకమయ్యారు.

ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కొందరు ప్రతిపక్షాల నేతలు కలిసి గువాహటిలో సైకిల్ యాత్ర చేశారు. దాదాపు 7 కిలోమీటర్ల దాకా యాత్ర సాగింది. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది కూడా సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. యాత్రలో పాల్గొన్న వాళ్లెవరూ సరిగ్గా మాస్కులు పెట్టుకోలేదు. ఎక్కువ మంది అసలు మాస్కులే పెట్టుకోలేదు.

ఈ ర్యాలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సీఎం హిమంత ట్విట్టర్ లో షేర్ చేశారు. బాక్సర్ కు మద్దతుగా ‘గో ఫర్ గ్లోరీ, లవ్లీనా’ అనే ప్రచారాన్ని ప్రారంభించినట్టు ఆయన వివరించారు. అందులో భాగంగానే సైకిల్ ర్యాలీని నిర్వహించామన్నారు. కార్యక్రమం సందర్భంగా లవ్లీనా తండ్రి టికెన్ బోర్గోహెయిన్ ను సన్మానించారు.