జమ్మూ ఎయిర్​ ఫోర్స్​ స్టేషన్​ వద్ద మరోసారి డ్రోన్​ సంచారం

21-07-2021 Wed 12:15
  • ఇవ్వాళ తెల్లవారుజామున 4.05 గంటలకు ఘటన
  • అతి సమీపంలోకి వచ్చిందన్న అధికారులు
  • గత నెల 27న ఎయిర్ బేస్ పై డ్రోన్ దాడి
Drone Spotted again at Jammu Airforce Station

జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్ దాడి జరిగి నెల రోజులు తిరగకముందే.. మరో డ్రోన్ అక్కడ చక్కర్లు కొట్టింది. ఈరోజు తెల్లవారుజామున 4.05 గంటలకు సత్వారీలోని ఎయిర్ బేస్ వద్ద డ్రోన్ కనిపించినట్టు అధికారులు చెబుతున్నారు. ఎయిర్ బేస్ కు అతిసమీపంలోనే అది తిరుగాడిందన్నారు. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

జూన్ 27న జమ్మూ విమానాశ్రయంలోని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై నిమిషాల వ్యవధిలో డ్రోన్లతో బాంబు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో స్టేషన్ పైకప్పు దెబ్బతింది. ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు డ్రోన్లు అక్కడ చక్కర్లు కొట్టాయి. ఈ డ్రోన్ల దాడులు, సంచారం వెనుక విదేశీ శక్తులే ఉన్నాయని తమ దర్యాప్తులో తేలిందని జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ నిన్న చెప్పారు.